ఇండియా సుడిగాలి ప్రయాణం

తెల్లవారుఝామున నాలుగు గంటలకి ఫోన్ వచ్చింది అమెరికా లో వున్న రాణి అక్క దగ్గర్నుంచి ఇండియా కి వస్తున్నానని ఎల్లుండి ఉదయాన్నే. ఇదేంటబ్బా ఇంత హఠాత్తుగా....అనుకున్నా. వెళ్ళి  ఆరు నెలలైనా కాలేదు ఏమయిండొచ్చు... అని అదే విషయం అడిగా... తన ప్రాణ స్నేహితురాలి  కూతురి పెళ్ళి ఉందని ముందు రావాలని అనుకోకున్నా  ఆ అమ్మాయి మరీ మరీ అడగటం తో కేవలం మూడు రోజుల కోసం వస్తున్నానని , మొదటి రోజు నేరుగా కర్నూల్ కి వెళ్ళి పెళ్ళి చూసుకుని అటునుంచి మా ఇంటికి వస్తానని సారాంశం .  

రాణి అక్క మా పెద్ద తోడికోడలు. ఇద్దరు అమ్మాయిలు, కుటుంబం అంతా అమెరికా లో సెటిల్ అయ్యారు.చాలా హుషారయిన మనిషి. వంటలు బాగా చేస్తుంది. తనవాళ్ళనుకుంటే ఇక వాళ్ళ గురుంచి స్పెషల్ కేర్ తీసుకుంటుంది. ఇక ఈ మూడు రోజులు మాకు తెగ హడావిడి అనుకుంటూ మా  చిన్నతోడికోడలికి (లక్ష్మి) ఫోన్ చేసి చెప్పా.   ఇక ఆ రోజు సాయంత్రం అక్కకు వాట్స్ ఆప్ కాల్ చేసి అడిగా తనకు ఏమయినా  కావాలా అని ,కొనిపెట్టాలంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి. అప్పుడు పెద్దగా ఏమి వద్దని, వీలయితే పచ్చళ్ళు ప్యాక్ చేయించమని. 

నేను అపనమ్మకంగా విన్నాను ఎందుకంటే తను వచ్చిందంటే ఒక టోర్నడో వచ్చినట్టే అందరికి రకరకాల పనులు పురమాయిస్తూ చాకచక్యంగా అన్ని పనులు చేయించుకుంటుంది.. ఇంతలో లక్ష్మి కాల్ రానే వచ్చింది , వాళ్ళ అమ్మాయిలకు లేటెస్ట్ మోడెల్ డ్రెస్లు, క్లిప్పులు, బొట్టు బిళ్ళలు ఇలాంటివన్ని కావాలందని.. అదేం పెద్ద పనిలే ఇద్దరం కలిసి వెళ్ళి కొందాం అనుకున్నాం.  మామిడి కాయలు, చింతకాయలు కొని పెడితే తను ఎలా పచ్చడి చేయాలొ చెప్తాను అని. అంతే కాదు వాళ్ల అమ్మాయికి  శ్రీమంతుడు  సినిమాలో హీరోయిన్ వేసుకున్న లాంటిదే ఒక లంగా పరికిణి, చిలక పచ్చ ఆర్గంజా పట్టు లహెంగా కు ఎరుపు బార్డర్ కావాలని లక్ష్మి కి చెప్పిందట. వెంటనే లక్ష్మి  శ్రీమంతుడు  సినిమా వేసుకొని చూసింది ఆ పరికిణి లంగా ఎలాంటివో చూడాలని. అక్కా సినిమా అంతా రెండు సార్లు చూసాను హీరోయిన్ అలాంటి లెహంగా  ఎప్పుడూ  వేసుకొలేదు ఇప్పుడు ఎలా అంది దిగులుగా. ఆప్పుడు నేను అయ్యొ అవి రెండూ ఒకటి కాదు ఆ సినిమా లో ఫలాన సీన్ లో ది ఒకటి, ఇది మరొకటి రెండు వేరే వేరే అని సరిదిద్దంగానే ఓహో అలాగా అని ఉపిరి పీల్చుకుంది. ఇక వేట మొదలయ్యింది మ ఆస్థాన టెంపరరి డ్రైవర్ సహాయంతో షాపింగ్ మొదలెట్టాం.  

అన్నీ దొరికాయి కొంచెం అటు ఇటు గా, కానీ ఆ సినిమా లాంటి బట్టలు దొరకడం కొరకు. మాకు తెలిసిన షాపులన్ని గాలించాము. చివరగా క్లాత్ దొరికింది అదే విషయం చెప్పాం మరి దాన్ని కుట్టించాలిగా లేకపొతే ఇంత శ్రమ వృధా.  వెంటనే చెప్పింది మల్కాజ్ గిరి లో తనకు తెల్సిన ఒక ఫ్యాషన్ డిజైనెర్ వుందని తనకు ఇచ్చి అక్క పేరు చెప్తే ఒక్క రోజులోనే కుట్టి ఇస్తుందని.  వెంటనే అటు పరిగెత్తి అది ఇచ్చాం తనకు ఒక్క రోజులో ఇవ్వాలని కాస్తా డబ్బులు ఎక్కువైనా ఇస్తామని.  ఇక పరికిణికొరకు ప్లైన్ క్లాత్ కొని బడే చొడి లో డయింగ్ కు ఇవ్వాలి. ఈ మధ్య హైదారాబాద్ లో వస్తున్న కుండ పోత వాన... ట్రాఫిక్ జాం, వీటన్నిటి మధ్యలో ఇవన్నీ చేసి గర్వం గా పనులు అన్ని అయ్యాయి.. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం నేను లక్ష్మి. మధ్య మధ్య  రోడ్ల మీద నిల్చిన మూడు నాలుగు అడుగుల నీళ్ళలోనుంచి కార్లో వెళ్తుంతే  వెనిస్ లో పడవలో షాపింగ్ చేస్తునట్టు గా ఊహించుకున్నాం.  (కార్ భాగాలలోకి  నీళ్ళు వచ్చి పాడవుతుందన్న ఊహకన్న ఇది మేలుకదా ప్రశాంతంగా  వుండవచ్చు.)  ఇక అక్క బయలు దేరింది పెళ్ళి నుంచి. మధ్యాహ్నం ఎప్పుడో బయలుదేరితే ఈ రద్దీ కారణం గా రాత్రి ఒంటిగంటకి ఇంటికి చేరింది. రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ గడిపేసాం. ఉదయాన్నే  చింతకాయలన్నీ  శుభ్రం గా కడిగి ఉప్పు పసుపు పచ్చి మిరపకాయలు వేసి దంచి ప్యాక్ చేయిస్తావా...  ప్లీజ్..... అని అడిగింది తప్పుతుందా దగ్గరుండి మా వంటావిడ తో చెప్పి చేయించా. 

తనే లక్ష్మి వాళ్ళ కుటుంబాన్ని కూడా తను ఉన్నంత వరకు మాఇంట్లోనే ఉండమని రెక్వెస్ట్  చేసింది. ఇక అందరికి టిఫిన్లు ,కాఫీలు భోజనాలు  పైపెచ్చు పచ్చళ్ళు చేయటంలో బిజీ గా ఉన్నాం. మా నానమ్మకి ఈ మధ్య కాస్తా ఆరోగ్యం బాగుండటం లేదు. అమ్మా వాళ్ళిల్లు దగ్గరే పది నిమిషాల్లో చేరుకోవచ్చు.. పలకరించి వస్తానె అని తను చక్కా వెళ్లి పోయింది. వెళ్తూ మామిడికాయలు కాస్తా మగ్గించి పెట్టు నేను వచ్చి పచ్చడి కలుపుతాను అని ,..మళ్ళీ కాస్తా కలిమి కాయలు తెప్పించవా అని కొసరు. మేము పచ్చళ్ళ పన్లో వున్నాం కాబట్టి డ్రైవర్ కు పురమాయించాం కాయల పని.డ్రైవర్ ఫోన్ చేసాడు తిరిగి తిరిగి, నాకు తెలియటం లేదు ఆ కాయలేంటో, ఎలా గుర్తు పట్టాలి అని. వెంటనే మా లక్ష్మి గూగుల్ లో వెతికి ఫొటో లు పంపించింది అతనికి.  అతను ఈ మధ్యనే స్మార్ట్ ఫోన్ జియొ కనెక్షన్ తీసుకున్నాడులేండి..  మాకు గుడ్ మార్నింగ్ మెసెజ్ లు గట్రా పంపిస్తుంటాడు.అమ్మో ఇప్పుడంటే what's app లు మోబైల్ ఇంటెర్నెట్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, ఈ స్మార్ట్ ఫోన్ లు ఇంటెర్నెట్ ఇంతగా లేని కాలం లో మరి ఎలా? ఎంత కష్టం.. ఊపిరే ఉండదు అన్నంత భయం వేసింది ఆ అలోచనతోనే ....
ఇంతలో మా అక్క మూడు గంటల తర్వాత  వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి,( మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి )  పెద్ద పెద్ద బ్యాగ్ లతో.  అక్కడ అమ్మ తో పొడులు ,అటుకుల చుడువా, అప్పుడే చెట్టు నుంచి తెంపిన  మామిడి కాయలతో చెక్కు తొక్కు, రసకాయ మొదలయిన సరంజామాతో. (పిన్ని మీరు చేసేది మా ఆయనకు చాల ఇష్టంఅనగానే అమ్మ దానిదేముందమ్మ ... అదేం భాగ్యం ఇప్పుడే చేసిస్తా అంటూ అన్ని చేసి పంపించింది)  

అంతేనా వాళ్ళ చెల్లెలు వాళ్ళు వచ్చారు పలకరించి పోదామని, వాళ్ళు లోయర్ టాంక్ బండ్ దగ్గరున్న ఎమరాల్డ్ షాప్ నుంచి స్వీట్లు, పిండివంటలు తెచ్చారు అక్క ఆర్డర్ పై.  మర్నాడు బట్టలన్ని డెలివరీ తీసుకొని అన్ని ప్యాకింగ్లూ చేసి అమెను ఫ్లయట్ ఎక్కించి వచ్చాం.  బంగాళాఖాతం పైన ఏర్పడిన అల్పపీడన  ద్రోణి బలహీన పడి దారి మార్చుకొని వెళ్ళినట్టుగా, హైదరాబాద్ లో ఏకధాటిగా  రెండు గంటలు వర్షం పడి వెలిసి వీధులన్ని నేటితో చెల్లా చెదురైనట్టుగా అనిపించి ఒక్క సారి గట్టిగా గాలి పీల్చుకొని ఈ రెండు రోజుల్లో చేసినవన్నీ గుర్తుచేసుకొని, అక్క అద్భుతమైన అడ్మినిస్ట్రేటివ్ సామర్థ్యాలకు, పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్ కు అబ్బురపడుతూ మేము మళ్ళీ మా  పనుల్లో పడిపొయాం నేనూ లక్ష్మి .

No comments:

Post a Comment

హృదయాన్ని స్పృశించే పాట

రంగస్థలం సినిమా ఎలా ఉన్నా ఈ పాట మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. చంద్రబోస్ కలం నుంచి జాలువారిన మరో అద్భుతం.  చెట్టంత ఎదిగిన కొడుకు మరణిస్తే ...