మాంగల్యం "తంతు" నానేనా (కథ)

(కథ)

పెళ్ళి వారమండి...... మగ పెళ్ళి వారమండి..... అనే బాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆర్కెస్ట్రా బృందం హుషారుగా వాయిస్తుండగా వరుడు కళ్యాణ్ అతని బంధువర్గం కల్యాణమండపం చేరారు.హాల్ ముందర పెద్ద బ్యానర్ పై " కళ్యాణ్    వెడ్స్ మహాలక్ష్మి " అని చక్కటి ఫొటోలతో  కట్టి , శక్తి కొద్దీ హాలంతా అలంకరించి వుంది. ఫరవాలేదు  బయటి ఏర్పాట్లు  బానేవున్నాయి ఇక లోపలి  సంగతి ఏంటో  అని వీరు అనుకుంటుండగా మహి(పెళ్ళి కూతురు) తరఫు వారు వచ్చి సాదరంగా ఆహ్వానించి ఫ్రెష్ అవమని  కాఫి, టిఫిన్ ల ఏర్పాట్లు చూడసాగారు. 


 కళ్యాణ్ అమెరికా లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆరంకెల జీతం, అందగాడు పెళ్ళీడు దాటుతోందని ఇంట్లో వాళ్ళు అతడు ఇండియా రాకుండనే స్కైప్ లో అమ్మాయిని చూపించి  సంబంధం ఓకే  చేయించారు. అలా అని మహలక్ష్మి ఏమి తక్కువ కాదు పేరుకు తగ్గట్టే లక్ష్మీదేవి లాంటి రూపం కల్గిన గుణవంతురాలు, తనూ ఒక సాఫ్ట్ వేర్ వుద్యోగం
చేస్తోంది, ఇంకా సాంప్రదాయమైన కుటుంబం,పైగా దూరపు బంధుత్వం కూడా వుంది. అందుకే చకా చకా ఇరువర్గాలు ఒప్పుకోవడం  ముహూర్తాలు పెట్టుకోవడం  జరిగిపోయాయి.


 పెళ్ళి మండపమంతా కళకళలాడసాగింది ఒక్కసారిగా.కొత్త కొత్త డిజైన్ల పట్టు చీరలతో ,నగలతో స్త్రీలు- సూట్లు షేర్వాణిలు, కుర్తా పైజామాలతో అబ్బాయిలు.... సందడి చేయసాగారు. పనుల్తో  హడావిడిగా అటుఇటు తిరిగేవారు
కొందరు, వచ్చిన వారిని పలకరించి ఆహ్వానించి  మర్యాదలు చేసేవారు కొందరు, అబ్బాయి తరఫువాళ్ళం అని గంభీరం పొయేవాళ్ళు ఇంకొందరూ మొత్తానికి కోలహలం గా వుంది.ఇక పెళ్ళిచేయించడానికి వచ్చిన పురోహితులు
నరసిం హ శర్మ గారు అమ్మాయిని, అబ్బాయిని తీసుకు రమ్మని తొందరించ సాగారు.  

మహాలక్ష్మి  వంగపండు రంగు బెనారస్ వెండి బార్డర్  చీరలో పెళ్ళికూతురు అలంకరణ లో సింపుల్ గా, పొందికగా, చక్కగా, అందంగాముస్తాబై ఎరుపెక్కిన నున్నని బుగ్గలతో కళ్యాణ్  ని ప్రత్యక్షం గా ఎప్పుడు చూస్తానా.... అని ఎదురుచూస్తూంది .ఇకకళ్యాణ్ అయితే  ఏ మాత్రం చాన్స్ దొరికినా మహి తో ఒంటరిగా కలిసి మాట్లాడేయాలని తెగ తొందరపెడుతున్నాడు.అందరూ వేదిక పై ఆసీనులయ్యారు. కార్యక్రమం మొదలయ్యింది. కాసేపట్లొ కళ్యాణ్ తరఫు పెద్దమనిషి ఒకాయనరామ శర్మ గారని ఒక పండితుదు విచ్చేసారు. ఆయన్ని గౌరవంతో వేదిక పైన కూర్చోపెట్టారు.అంతే ఈయన తనే పేద్ద  పండితుడనని   ప్రతి విషయం లో జోక్యం చేసుకొని నరసిం హ శర్మ గారికి అడ్డుపడసాగాడు.

 "కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం" లా వుంది పరిస్థితి అక్కడ.నరసింహం గారే కాస్త సర్దుకు పోతున్నారు. ఉదయాన్నే 4:48కి సుముహూర్తం.ముందు రోజు రాత్రి కార్యక్రమాలు ఎలాగో పూర్తయ్యయని పించారు.ఇక భోజనాలకి అందరూ కదలి వెళ్ళారు.  అప్పుడే నరసింహం గారు ఉదయానికి అవసరమయ్యే సామాగ్రి , మధుపర్కాలు, మాంగల్యాలు ,మెట్టెలు   వగైరాలన్ని తయారుగా వుంచమని మహి నాన్న గారైన  రాజగోపాల్ కి పురమాయించారు. ఆయన వెళ్ళి భార్యతో(విజయ) ఇదే విషయం  చెప్పారు. ఆవిడ సరేనని వెళ్ళి ఏర్పాట్లు చూడసాగింది.  అన్ని అయ్యాయి..... మాంగల్యాలు, మెట్టెలు పెళ్ళి ఇంట్లో వుంచగూడదంటారని  అవి ఆమె పిన్ని గారికి ఇచ్చింది.

అందుకే వెళ్ళి  "పిన్నీ అన్నీ తయారుగా వున్నాయి ఆ మాంగల్యాలు, మెట్టెలు జాగ్రత్తేగా" అంది.
వెంటనే పిన్ని" అదేంటే అప్పుడే నీకు ఇచ్చేసాగా?  ఎక్కడ పెట్టావు ?? కొంపదీసి పోగొట్టవా ఏంటి" అంటూ ఎదురు దాడికి దిగింది .విజయ భయపడిపోయి " అయ్యో  ఇచ్చేసావా సర్లే చూస్తాను ఎక్కడ పెట్టానో" అంటూ గదిలో కి వెళ్ళింది ఖంగారుగా.

తనకి బాగా గుర్తు వుంది పిన్ని గారసలు ఇవ్వలేదు!  ఎవరికిచ్చిందో ? ఎక్క్డపెట్టారో అని అందోళనగా వెతకసాగింది.ఎక్కడా  లేవు  సర్దినవారిని ఎవరిని అడిగినా తెలియదంటున్నారు  ఏం చేయాలో పాలు పోవడం లేదు విజయకి. భర్త ని పిలిచి రహస్యం గా చెప్పింది ఇదీ విషయం అని. గోపాల్ గారికి ఒక్క క్షణం ముచ్చెమటలు   పట్టాయి.ఇప్పటికే రాత్రి 11:30  గంటలయ్యింది. ఇంకో  ఐదు గంటల్లొ ముహుర్తం వుంది పొనీ అవసరం గా కొందామన్నా అన్ని షాపులు మూసేసుంటారు.ఫైగా ఈ విషయం నలుగురికి తెలిస్తే ఎంత నగుబాటు ? ఎంత అప్రతిష్ఠ ? ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టుంది.  ఇన్ని లక్షలు ఖర్చుపెట్టి ఘనంగా పెళ్ళి చేస్తుంటే,  అతి ముఖ్యమైనవే దొరకడం లేదే ? ఇప్పుడెలా  అని పరిపరి విధాల   అలొచించసాగాడు.

ఇంతలో ఘొల్లుమని   పిన్నిగారు ఏడుపు ఆరంభించారు.అందుకే నేను ముందే చెప్పాను  నాకియ్యొద్దమ్మా అని విన్లేదు చూడు ఇప్పుడు అవి పోయాయంట "ఇప్పుడీ అపఖ్యాతి నాకేగా" అంటూ. "అయ్యో పిన్నిగారు మిమ్మల్ని ఏమనలేదండీ మీరిచ్చేసారుగా మేమే ఎక్కడోపెట్టి మరిచిపోయాం"   అని ఆమెని శాంతింప చేసే పనిలో కొందరు పడ్డారు.ఎక్కడ అల్లరి అవుతుందో అని. చూస్తుండగానే ఒకరి నుంచి ఒకరికి  వార్త పాకిపొతోంది .విడిదింట్లొ విషయం తెలిసి  వచ్చి వాళ్ళు ఖంగారుగా  ఎలా జరిగింది? ఏం చేద్దాం? అంటూ తర్జన భర్జనలు పడసాగారు.  

 అప్పుడే  తెలుసుకున్న ఒక దూరపు బంధువు  ఒకావిడ వచ్చి అడిగింది ఏమైందండీ? అంటూ- వొళ్లు మండింది అక్కడున్నవాళ్ళకు . కాని అదేం కనపడనీయకుండా విషయం  చెప్పారు. అప్పుడు ఆమెవారి పాలిటి అపద్భాంధవి లా  "హైదరాబాద్లో మా ఇంట్లొ ఒక కొత్త మాంగల్యాలు వున్నాయి" "నావి దొంగతనం అయితే టెంపరరీ గా ఏవో ఒకటి వేసుకున్నాను. కొత్తవి చేయించి  ఇంట్లో పెట్టాను మంచి రోజు వేసుకుందామని . ఎవరైనా వెంటనే కార్లో వెళితే ముహూర్తం సమయం వరకు తేవచ్చు" అంది.అందర్లో కదలిక మొదలయ్యింది . కళ్యాణ్ అన్నయ్య , బావలు ఠక్కున  బయలు దేరారు తెస్తామని.

కలకలం కొంచెం సద్దుమణిగింది. అయినా అనుకునే వారు రకరకాల వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు. ఎక్కడా చూళ్ళేదమ్మ ఇలా జరగడం అని , అంత అజాగ్రత్తగా వుంటే ఎలా? ఇదేమైనా అషామాషి వ్యవహారమా అంటూ.వెళ్ళి రావడనికి కనీసం 4:30 గంటలు పడుతుంది సమయంలోపల రాలేక పోతే పసుపుకొమ్మే గతి అని సన్నాయి నొక్కులు నొక్కే వారు కొందరు.  

అప్పటి దాకా సిగ్గుతో అందంగా ఎరుపెక్కిన మహి మొహం లో బాధ, భయం తో  కూడిన ఎరుపుతో కందిపోయింది .విజయ అయితే గండం గడిచి అంతా సవ్యం గా జరిగితే తిరుమలకు నడచి వస్తానని, మరికొన్ని మొక్కులు టక టక మొక్కేసింది. ఇక సమయాభావం వల్లైతేనేమి, జరిగిన దానివల్లనేమి ఎవరి కంటికి కునుకే లేదు. ప్రతి 15 ,20 నిమిషాలకొక సారి  ఫోన్  చేస్తున్నారు ఎక్కడున్నారని.

సమయం తెల్లవారుఝామున 3 గంటలు మాంగల్య ధారణ  ముందు కార్యక్రమాలు కాశీ యాత్ర మొదలైనవి చురుకుగా సాగుతున్నాయి. . ఉండేది వుండగా మళ్ళీ ఇద్దరు శర్మల టాం ఆండ్ జెర్రి కార్టూన్ షో మొదలయ్యింది.  ఇంతలో భళ్ళున శబ్దం వచ్చింది ఏదో పగిలినట్టుగా   దాంతో బాటే రామ శర్మ గారి లబో దిబోలు .ఏం జరిగిందని చూస్తే వీడియో గ్రాఫర్  వెలుతురు కోసం పెట్టుకున్న లైటు  కిందపడి ముక్కలయ్యి ఒకటి రామ శర్మ గారికి గుచ్చుకుంది అది సంగతి. ఆయనికి ఫస్ట్ ఎయిడ్ చేసి ఒక దగ్గర శాంతంగా కూర్చోపెట్టి "అమ్మయ్య ఇది ఒకందుకు మంచిదే అయ్యింది అని" ఊపిరి పీల్చుకున్నారు .    

"నాలుగు గంటల పది నిమిషాలు" మరి అట్టే సమయం లేదు ముహుర్తానికి అందరిలో ఒకటే ఉత్ఖంఠ!!. అయోమయం గా పెళ్ళి తంతు జరుగుతోంది. పెళ్ళి కొడుకు వెనకాల నించున్న అతడి చెల్లి సడెన్ గా అన్నయ్య లే! లే! అని అరిచింది. ఏమైంది? ఏమైంది? అని అందరూ మళ్ళీ ఖంగారు పడ్డారు. వేదిక పై వుంచిన వెలుగుతున్న పెద్ద పెద్ద దీపాలలోని    ఒత్తి  సెగకు అనుకోకుండా కళ్యాణ్ మధుపర్కం పంచెకు తగిలి అక్కడక్కడా  పెద్ద పెద్ద కన్నాలయ్యాయి ప్రమాదమేమీ జరగలేదు కాని, పెళ్ళికని పదివేలు పోసి కొన్న పట్టుపంచె ఇలాగయ్యిందేమని  కలవరపడ్డారు.   కళ్యాణ్ గదిలోకి వెళ్ళాడు  మార్చుకునేందుకు. ఇన్ని అపశకునాలు ఎదురవుతున్నాయి, ఇప్పుడే  పెళ్ళి చేయాలా అని మూఢనమ్మకాలు కలవారు  అసలు ఆపేసినా   బాగే అని సణుక్కుంటున్నారు. కాని ఆధునిక భావాలు ఉన్న కళ్యాణ్ అదేమి పట్టించుకోకుండా పంచె మార్చుకు వచ్చి కూర్చున్నాడు.          

ఇదేం పెళ్ళి రా బాబోయి "క్షణ క్షణ  గండం నూరేళ్ళ ఆయుష్షు" లా వుంది ఈ పెళ్ళి. మొదలైనప్పటి నుంచి ఒకరి మొహం లో కుడా ఆనందం లేదు  ఆందోళన తప్ప. ఇక ఈ ఫోటో లు వీడియోలు   ఏం బాగా వస్తాయి అని విసుక్కున్నాడు ఫొటో గ్రాఫర్.  

జీలకర్ర బెల్లం పెట్టించేసారు శర్మ గారు ఇక మాంగల్య ధారణే తరువాయి.ఒక అమ్మమ్మ అయితే పసుపుకొమ్ము ను సిద్ధం కూడా చేసింది  రాకపొతే పనికొస్తుందని.

చివరి ఐదు నిమిషాలు మిగిలాయి.ఇదిగోండి పంతులు గారు మరేం చేస్తాం ఈ పసుపుకొమ్ము తో పని కానీయండి  అంటూ అందించింది . తప్పేం లేదమ్మా  శ్రేష్టం కూడాను  అని ఆయన అందుకున్నాడు.
   
సరిగ్గా అప్పుడే వచ్చారు తెలుగు సినిమాలో  "యు ఆర్ అండర్ అరెస్ట్" అని వచ్చే క్లైమాక్స్ లో పోలిసుల్లాగ, కోర్ట్ సీన్ లో జడ్జి తీర్పు ఇస్తుంటే సాక్షులతో ఎంటరయ్యే హీరో లాగా మాంగల్యం తో  కళ్యాణ్ అన్న, బావలు.

కట్ చేస్తే గట్టి మేళం మోగుతుండగా తాళి కడుతున్నాడు కళ్యాణ్, మురిపెంగా సిగ్గులు పోతున్న మహి మెడలో అపురూపంగా, శర్మగారు గట్టి గా మైకులో చదువుతున్నారు  " మాంగల్యం తంతు నానేనా " అంటూ.

   (Picture courtesy :google images)

1 comment:

 1. No comments:

  Post a Comment

  అదేమిటి నో కామెంట్స్ అని మళ్ళా పోస్ట్ ఏ కామెంట్ అంటూ ఇలా చిత్రంగా చమత్కారం చేసారు అనుకోవచ్చు కాని అది ప్రయత్నం చెయ్యకుండా ఆట్టే కష్టపడకుండా ఇలా పెట్టాను.

  కాని అలా ఎందుకు పెట్టానో మీరు అర్థం చేసుకోగలరు అని భావిస్తున్నాను(లేదంటే చెబుతాను మీ అభ్యర్ధన మేరకు), ఇహ పోస్ట్ ఏ కామెంట్ అని యథాతధంగా పెట్టటంలో ఆంతర్యం - పోస్ట్ ఏ "కామెంట్" అని భావనతో నాకు తట్టింది టక్కున చెప్పేస్తున్నాను ఇదిగోండి.

  ముందుగా నాకు తెలియంది ఏమి లేకపోయినా, అత్యంత గౌరవభావముతో వివాహము చేసుకోవలసిన వ్యక్తిగా లేదు ఆ ఆశ్రమ ధర్మం ఏమిటో తెలిసే ముందు మన ఆలోచన విధానం ఎలా ఉంటే కాదు కాదు సవరించుకుంటే వివాహం అంటే ఇలా ఉండాలి అని ఇంచుమించుగా వచ్చిన పెద్దలు చెప్పుకుంటే కొంత మనం ప్రయత్నం చేసి మరింత బాధ్యతని తీసుకుని, ఆ తదుపరి అదొక మధుర జ్ఞాపకముగా ఉంది, కేవలం నోట్లో నానే ఒక "తంతు" కాదు ప్రతీవారికి ఒక్క చక్కటి అవగాహన కలిగి వైదిక సంప్రదాయాన్ని తాము ఆచరించి అది వైదిక స్మృతి అని చెప్పుకోవటం కావలసినది ఎప్పుడూ.

  శుభం భూయాత్ !!!  అదేమిటి పైన శుభం కార్డ్ వేసేసి ఇదేమి కామెంట్ అనుకుంటున్నారా, లేదండి నేను సవినయముగా మనవి చేసుకుండేది ఒక్కట్టే, పెళ్లి అంటే అభిప్రాయమో లేక కామెంట్ చేసే స్తాయిలో మనం ఎప్పుడూ లేము, నిజానికి అసలు కామెంట్ అన్న భావనని వివాహముతో ముడి పెట్టకూడదు.

  మరి వివాహం గురించి తెలుసుకోవాలి అంటే రామాయణమును ఎల్లప్పుడూ ఆధారముగా తీసుకుని ఈనాడు, ఇకపై ఇటు మొగ పెళ్లి వారు అటు ఆడపెళ్లి వారు చదివితే/చదువుకుని/చదివించి, అసలు ఇటు బంధు సమూహములో అటు బంధు సమూహములో తెలుసుకుని ఒక వైదిక ప్రణాళిక అనుసరించి వెళితే అది వివాహం.

  పెద్దలు ఎందఱో ప్రవచించారు వివాహ వైభవం గురించి, వారి ప్రవచనం విని ఆచరిస్తే తరువాత కంప్లైంట్స్ ఉండవు అని పెద్దలు పదే పడే రెండు చేతులు జోడించి చెబుతున్నారు.

  ఎందుకండీ శుభం భూయాత్ అంటూ ఇలా వాయిస్తున్నారు అనుకోకండి, ఎదో చెప్పాలని మటుకు చెప్పటం లేదు. అనుసరించవలసింది అవగాహన కలిగి ఉంటే మన సరదాలు జీవితములో, జీవితానికి ఒక్కసారి జరిగే ఈ విశేషమైన వైదిక సంస్కరణ స్తితిని అభాసుపాలు చేయ్యబోవు.

  ప్రశాంతి గారు బావుంది మీరు రాసిన వివాహ సమయములో ఎదురైనా స్తితిగతులు గూర్చిన వివరణ.

  మీకో నిజం చెప్పాలి, ఏమిటంటే అబ్బో చెప్పవచ్చావు లే బాబు, కొంచం ఇప్పటివారి సరదాలు కూడా రుచి చూడాలి అని కాస్త ముందుకు తోసేవారే ఎక్కువ కాని మన సంప్రదాయం వైదిక స్తితి తరువాతే ఏ సరదా ఐనా, అది కూడా పెద్దలకు ఇబ్బంది కలిగింధకూడదు, అన్నిటికంటే వివాహం చేసుకుంటున్న నూతన వధూవరుల జీవితాల పై ఈషణ్ మాత్ర దుష్ప్రభావము చూపకుండా శ్రద్ధతో చెయ్యాలి, అప్పుడే అది ఆదర్శవంతం అలాగే పవిత్రవంతమౌతుంది.

  చివరిగా కామెంట్ కాదు కాని, కొంత వివరణ తగ్గించి ఉంటే చదివేవారికి ఓపిక సంగతి అలా ఉంటే, ఈ శీర్షికకు వారి ప్రత్యుత్తరం మటుకు మరచిపోకుండా రాయగలరు.

  సరదాగా అన్నాను లెండి, కట్ చేస్తే అదేదో చిత్రములో సదరు హీరోగారు వివాహం అంటే మూడంకె కాదు, సరదాగా ఉండాలి అన్నట్టు అలా అన్నాను.

  నా ప్రత్యుత్తరం చెప్పే నిమిత్తం వ్యక్తపరిచిన భావనలో ఇబ్బంది ఉంటే మన్నించి, ఇంకొంచం సున్నితముగా చెప్పవలసింది అని సూచన చేయగలరు.

  ధన్యోస్మి.


  ReplyDelete

హృదయాన్ని స్పృశించే పాట

రంగస్థలం సినిమా ఎలా ఉన్నా ఈ పాట మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. చంద్రబోస్ కలం నుంచి జాలువారిన మరో అద్భుతం.  చెట్టంత ఎదిగిన కొడుకు మరణిస్తే ...