హృదయాన్ని స్పృశించే పాట

రంగస్థలం సినిమా ఎలా ఉన్నా ఈ పాట మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. చంద్రబోస్ కలం నుంచి జాలువారిన మరో అద్భుతం.  చెట్టంత ఎదిగిన కొడుకు మరణిస్తే ఆ తండ్రి పడే వేదనని చిన్న మాటలే అయిన విన్న ప్రతి వారు ఆ బాధ అనుభవించేలా రాసి , గాత్ర దానం కుడా చేసారు.

ఈ రెండో చరణం నాకు మరీ మరీ నచ్చింది.


తమ్ముడు నీకోసం తల్లడిల్లేనయ్యా
సెల్లి గుండె నీకయి సెరువయిపోయిందయ్యా
కంచంలోని మెతుకు నిన్నే వెతికేనయ్య
నే కళ్ళద్దాలు నీకయి కలియజూచేనయ్యా
నువు తొడిగిన సొక్కానీకయి దిగులు పడి
సిలుక కొయ్యకురి పెట్టుకుందిరయ్యా....

రంగస్థలానా...

రంగస్థలానా నీ పాత్ర ముగిసెనా
వల్లకాట్లో శూన్య పాత్ర మోదలయ్యేనా 
నీ నటనకి కన్నీటి సప్పట్లు కురిసేనా
నువెల్లొత్తనంటూ సెప్పేవుంటావురా
మా పాపపు సెవికది ఇనపడకుంటాది రా 

ఓరయ్యో ... నా అయ్యా 

ఓరయ్యో ... నా అయ్యా 


Video courtacy : You tube

ఇండియా సుడిగాలి ప్రయాణం

తెల్లవారుఝామున నాలుగు గంటలకి ఫోన్ వచ్చింది అమెరికా లో వున్న రాణి అక్క దగ్గర్నుంచి ఇండియా కి వస్తున్నానని ఎల్లుండి ఉదయాన్నే. ఇదేంటబ్బా ఇంత హఠాత్తుగా....అనుకున్నా. వెళ్ళి  ఆరు నెలలైనా కాలేదు ఏమయిండొచ్చు... అని అదే విషయం అడిగా... తన ప్రాణ స్నేహితురాలి  కూతురి పెళ్ళి ఉందని ముందు రావాలని అనుకోకున్నా  ఆ అమ్మాయి మరీ మరీ అడగటం తో కేవలం మూడు రోజుల కోసం వస్తున్నానని , మొదటి రోజు నేరుగా కర్నూల్ కి వెళ్ళి పెళ్ళి చూసుకుని అటునుంచి మా ఇంటికి వస్తానని సారాంశం .  

రాణి అక్క మా పెద్ద తోడికోడలు. ఇద్దరు అమ్మాయిలు, కుటుంబం అంతా అమెరికా లో సెటిల్ అయ్యారు.చాలా హుషారయిన మనిషి. వంటలు బాగా చేస్తుంది. తనవాళ్ళనుకుంటే ఇక వాళ్ళ గురుంచి స్పెషల్ కేర్ తీసుకుంటుంది. ఇక ఈ మూడు రోజులు మాకు తెగ హడావిడి అనుకుంటూ మా  చిన్నతోడికోడలికి (లక్ష్మి) ఫోన్ చేసి చెప్పా.   ఇక ఆ రోజు సాయంత్రం అక్కకు వాట్స్ ఆప్ కాల్ చేసి అడిగా తనకు ఏమయినా  కావాలా అని ,కొనిపెట్టాలంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి. అప్పుడు పెద్దగా ఏమి వద్దని, వీలయితే పచ్చళ్ళు ప్యాక్ చేయించమని. 

నేను అపనమ్మకంగా విన్నాను ఎందుకంటే తను వచ్చిందంటే ఒక టోర్నడో వచ్చినట్టే అందరికి రకరకాల పనులు పురమాయిస్తూ చాకచక్యంగా అన్ని పనులు చేయించుకుంటుంది.. ఇంతలో లక్ష్మి కాల్ రానే వచ్చింది , వాళ్ళ అమ్మాయిలకు లేటెస్ట్ మోడెల్ డ్రెస్లు, క్లిప్పులు, బొట్టు బిళ్ళలు ఇలాంటివన్ని కావాలందని.. అదేం పెద్ద పనిలే ఇద్దరం కలిసి వెళ్ళి కొందాం అనుకున్నాం.  మామిడి కాయలు, చింతకాయలు కొని పెడితే తను ఎలా పచ్చడి చేయాలొ చెప్తాను అని. అంతే కాదు వాళ్ల అమ్మాయికి  శ్రీమంతుడు  సినిమాలో హీరోయిన్ వేసుకున్న లాంటిదే ఒక లంగా పరికిణి, చిలక పచ్చ ఆర్గంజా పట్టు లహెంగా కు ఎరుపు బార్డర్ కావాలని లక్ష్మి కి చెప్పిందట. వెంటనే లక్ష్మి  శ్రీమంతుడు  సినిమా వేసుకొని చూసింది ఆ పరికిణి లంగా ఎలాంటివో చూడాలని. అక్కా సినిమా అంతా రెండు సార్లు చూసాను హీరోయిన్ అలాంటి లెహంగా  ఎప్పుడూ  వేసుకొలేదు ఇప్పుడు ఎలా అంది దిగులుగా. ఆప్పుడు నేను అయ్యొ అవి రెండూ ఒకటి కాదు ఆ సినిమా లో ఫలాన సీన్ లో ది ఒకటి, ఇది మరొకటి రెండు వేరే వేరే అని సరిదిద్దంగానే ఓహో అలాగా అని ఉపిరి పీల్చుకుంది. ఇక వేట మొదలయ్యింది మ ఆస్థాన టెంపరరి డ్రైవర్ సహాయంతో షాపింగ్ మొదలెట్టాం.  

అన్నీ దొరికాయి కొంచెం అటు ఇటు గా, కానీ ఆ సినిమా లాంటి బట్టలు దొరకడం కొరకు. మాకు తెలిసిన షాపులన్ని గాలించాము. చివరగా క్లాత్ దొరికింది అదే విషయం చెప్పాం మరి దాన్ని కుట్టించాలిగా లేకపొతే ఇంత శ్రమ వృధా.  వెంటనే చెప్పింది మల్కాజ్ గిరి లో తనకు తెల్సిన ఒక ఫ్యాషన్ డిజైనెర్ వుందని తనకు ఇచ్చి అక్క పేరు చెప్తే ఒక్క రోజులోనే కుట్టి ఇస్తుందని.  వెంటనే అటు పరిగెత్తి అది ఇచ్చాం తనకు ఒక్క రోజులో ఇవ్వాలని కాస్తా డబ్బులు ఎక్కువైనా ఇస్తామని.  ఇక పరికిణికొరకు ప్లైన్ క్లాత్ కొని బడే చొడి లో డయింగ్ కు ఇవ్వాలి. ఈ మధ్య హైదారాబాద్ లో వస్తున్న కుండ పోత వాన... ట్రాఫిక్ జాం, వీటన్నిటి మధ్యలో ఇవన్నీ చేసి గర్వం గా పనులు అన్ని అయ్యాయి.. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం నేను లక్ష్మి. మధ్య మధ్య  రోడ్ల మీద నిల్చిన మూడు నాలుగు అడుగుల నీళ్ళలోనుంచి కార్లో వెళ్తుంతే  వెనిస్ లో పడవలో షాపింగ్ చేస్తునట్టు గా ఊహించుకున్నాం.  (కార్ భాగాలలోకి  నీళ్ళు వచ్చి పాడవుతుందన్న ఊహకన్న ఇది మేలుకదా ప్రశాంతంగా  వుండవచ్చు.)  ఇక అక్క బయలు దేరింది పెళ్ళి నుంచి. మధ్యాహ్నం ఎప్పుడో బయలుదేరితే ఈ రద్దీ కారణం గా రాత్రి ఒంటిగంటకి ఇంటికి చేరింది. రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ గడిపేసాం. ఉదయాన్నే  చింతకాయలన్నీ  శుభ్రం గా కడిగి ఉప్పు పసుపు పచ్చి మిరపకాయలు వేసి దంచి ప్యాక్ చేయిస్తావా...  ప్లీజ్..... అని అడిగింది తప్పుతుందా దగ్గరుండి మా వంటావిడ తో చెప్పి చేయించా. 

తనే లక్ష్మి వాళ్ళ కుటుంబాన్ని కూడా తను ఉన్నంత వరకు మాఇంట్లోనే ఉండమని రెక్వెస్ట్  చేసింది. ఇక అందరికి టిఫిన్లు ,కాఫీలు భోజనాలు  పైపెచ్చు పచ్చళ్ళు చేయటంలో బిజీ గా ఉన్నాం. మా నానమ్మకి ఈ మధ్య కాస్తా ఆరోగ్యం బాగుండటం లేదు. అమ్మా వాళ్ళిల్లు దగ్గరే పది నిమిషాల్లో చేరుకోవచ్చు.. పలకరించి వస్తానె అని తను చక్కా వెళ్లి పోయింది. వెళ్తూ మామిడికాయలు కాస్తా మగ్గించి పెట్టు నేను వచ్చి పచ్చడి కలుపుతాను అని ,..మళ్ళీ కాస్తా కలిమి కాయలు తెప్పించవా అని కొసరు. మేము పచ్చళ్ళ పన్లో వున్నాం కాబట్టి డ్రైవర్ కు పురమాయించాం కాయల పని.డ్రైవర్ ఫోన్ చేసాడు తిరిగి తిరిగి, నాకు తెలియటం లేదు ఆ కాయలేంటో, ఎలా గుర్తు పట్టాలి అని. వెంటనే మా లక్ష్మి గూగుల్ లో వెతికి ఫొటో లు పంపించింది అతనికి.  అతను ఈ మధ్యనే స్మార్ట్ ఫోన్ జియొ కనెక్షన్ తీసుకున్నాడులేండి..  మాకు గుడ్ మార్నింగ్ మెసెజ్ లు గట్రా పంపిస్తుంటాడు.అమ్మో ఇప్పుడంటే what's app లు మోబైల్ ఇంటెర్నెట్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, ఈ స్మార్ట్ ఫోన్ లు ఇంటెర్నెట్ ఇంతగా లేని కాలం లో మరి ఎలా? ఎంత కష్టం.. ఊపిరే ఉండదు అన్నంత భయం వేసింది ఆ అలోచనతోనే ....
ఇంతలో మా అక్క మూడు గంటల తర్వాత  వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి,( మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి )  పెద్ద పెద్ద బ్యాగ్ లతో.  అక్కడ అమ్మ తో పొడులు ,అటుకుల చుడువా, అప్పుడే చెట్టు నుంచి తెంపిన  మామిడి కాయలతో చెక్కు తొక్కు, రసకాయ మొదలయిన సరంజామాతో. (పిన్ని మీరు చేసేది మా ఆయనకు చాల ఇష్టంఅనగానే అమ్మ దానిదేముందమ్మ ... అదేం భాగ్యం ఇప్పుడే చేసిస్తా అంటూ అన్ని చేసి పంపించింది)  

అంతేనా వాళ్ళ చెల్లెలు వాళ్ళు వచ్చారు పలకరించి పోదామని, వాళ్ళు లోయర్ టాంక్ బండ్ దగ్గరున్న ఎమరాల్డ్ షాప్ నుంచి స్వీట్లు, పిండివంటలు తెచ్చారు అక్క ఆర్డర్ పై.  మర్నాడు బట్టలన్ని డెలివరీ తీసుకొని అన్ని ప్యాకింగ్లూ చేసి అమెను ఫ్లయట్ ఎక్కించి వచ్చాం.  బంగాళాఖాతం పైన ఏర్పడిన అల్పపీడన  ద్రోణి బలహీన పడి దారి మార్చుకొని వెళ్ళినట్టుగా, హైదరాబాద్ లో ఏకధాటిగా  రెండు గంటలు వర్షం పడి వెలిసి వీధులన్ని నేటితో చెల్లా చెదురైనట్టుగా అనిపించి ఒక్క సారి గట్టిగా గాలి పీల్చుకొని ఈ రెండు రోజుల్లో చేసినవన్నీ గుర్తుచేసుకొని, అక్క అద్భుతమైన అడ్మినిస్ట్రేటివ్ సామర్థ్యాలకు, పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్ కు అబ్బురపడుతూ మేము మళ్ళీ మా  పనుల్లో పడిపొయాం నేనూ లక్ష్మి .

మనలో మాట -2

ఈ మధ్య  ఒక స్నేహితురాలి ఇంటికి పూనే  వెళ్ళాల్సివచ్చింది. ఆ రోజు ఉదయం  లేచేసరికి what's app  లో అందరూ కృష్ణుడిని  అలంకరించి పూజలు చేసి  రకరకాల నైవేద్యాలు పెట్టిన ఫొటోలు పంపించారు . అది చూసి ఏంటి ఈరోజు అని కాస్తా ఆలోచిస్తే  'కృష్ణాష్టమి' అని గుర్తుకు వచ్చింది.


చిన్నప్పుడు ఈ పండగ సందడే వేరేగా వుండేది. అమ్మ మధ్యాహ్నం దాక ఆగి (ఉద్యోగస్తురాలు అయినా కూడా) మడిగాచకిలాలు,మురుకులు ,దిబ్బణాలు,కర్జకాయలు,మైసూర్ పాక్ , రవ్వలడ్డు, మా ఆవుల పాల నుంచి తయారు చేసిన కోవా, పులిహోర ,దద్దోజనం , చక్కెర పొంగలి, క్షీరాన్నం  ఇలాంటి వండిన వంటలే కాక , చిక్కటి పాలు, పెరుగు ,వెన్న, మీగడ, నెయ్యి .. మిరియాల పొడి,శొంఠి పొడీ,జీలకర్ర పొడి (యశోద పచ్చి బాలెంతరాలు కాబటి ఇవన్ని తల్లికి.) వగైరాలు ఎన్నో  వంటలు దాదాపు తక్కువలో తక్కువ పదహారు రకాలు చేసి  రాత్రికి చక్కగా ఎంతో భక్తి తో చిన్ని కృష్ణయ్యకు పూజలు చేసి, దూడతో కూడిన గోమాత ను కూడా  పూజించి రాత్రికి మేము ఉపాహారాలు చేసే వాళ్ళం.( ఇన్ని తిన్నాకా ఇంకా ఉపాహారాం ఏంటీ అనుకుంటున్నారా భోజనం చేయట్లే కదా అందుకే).ఇదో చక్కని గుర్తు మాకు. సరేఇప్పుడు ఈ బాధ్యత మా పై పడింది.మొదట్లో ఇంత కాకపైనా ఇంతో కొంతా చేసేదాన్ని. క్రమేణా ఉద్యోగాలు  ,ఇతర పనులు మీద పడటం తో ( ఇవన్ని సాకులు మాత్రమే శ్రద్ధ లేక అని ఇప్పుడు తెల్సుకున్నాను)   కొంచెం కొంచెం తగ్గుతూ మొత్తమే మానేసాం.   

ఇంతలో నా ఫ్రెండ్ ఒక వ్యంగ్యమైన నవ్వు నవ్వి ఇవన్నీ ఇప్పుడు కొంత మంది చేస్తున్నారు కాని నీకు తెల్సా ఈ మధ్య నే ఒక న్యూస్ చదివాను మన పిల్లల జెనరేషన్ తర్వాత ఈ మతాలు ,పండగలు ఇవన్ని ఎవరికి తెలియవట. ఒకటే మతం  మిగులుతుంది మానవ మతం (ఇది మంచిదే కాని  ఇతరులకు ఇబ్బంది కలిగించనతవరకూ వేడుకలు జరుపుకోవడంలో, నమ్మకాలు కలిగి వుండడంలో తప్పులేదని నా అభిప్రాయం) ఇక సంస్కృతి సంప్రదాయాలు అనే పదాలు అసలు ప్రపంచంలో ఉండనే ఉండవట అని అంది. ( తను ఆస్తికత్వం మరియు నాస్తికత్వం మధ్యలో ఊగిసలాడుతోంది లేండి) .నాకు మాత్రం  మనసు చివుక్కు మంది మన పిల్లలకు తెలియకుండా పోవటానికి  కారణం ఎవరు మనమే కదా అనిపించింది . నేనూ దీనిలో నా పాత్రను పోషిస్తున్నాను అని కనువిప్పు కలిగింది. అంతే అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకున్నా ఇక నుంచి ప్రతి పండగను చక్కగా జరుపుకోవాలని తెల్సిన ప్రతి విషయాన్ని పిల్లలకి చెప్పాలని. ఎదో ఒక కుంటి సాకు తో  మన సాంప్రదాయాలకు మంగళం పాడకూడదని.... వెంటనే దసరా పండగ తో మొదలు పెట్టాను..


భగవంతుని నాలుగు వ్రతాలు

ఈ మధ్య మా ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి మా గురూజీ వచ్చారు.జరుగుతున్న కార్యక్రమం  లో భాగం గా అక్కడ కూర్చున్న మమ్మల్ని ఇలా అడిగారు.. వేదాలలో, పురాణాలో చెప్పిన విధంగా భగవంతుని నాలుగు వ్రతాలు ఎంటో తెలుసా అని అడిగారు..

మేమంతా వ్రతాలా !! అవి ఆ పైవాడికా .. సత్య నారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం, వైభవలక్ష్మి వ్రతం ఇలాంటివి విన్నాం  కాని అవన్ని మనలాంటి అల్పులకు , కాముకులకు కదా అని మనసు లో అనుకొని తెలియదని తల అడ్డంగా వూపాం. ఆప్పుడు గురూజీ మొదటిది "అభయ వ్రతం" అని చెప్పారు. అప్పుడు బుర్ర వెలిగింది మరి అనిపించింది  ఓహో... భగవంతుడు శరణుకోరే భక్తుల కు  అభయమివ్వటాన్ని ఒక పవిత్ర వ్రతం లా ఆచరిస్తారా.. అని భలేగా అనిపించింది. అప్పుడు మనకు ఒక సందేహం కలగొచ్చు. మరి ఎందుకు మనకు ఆపదలలో ప్రతిసారి ఆదుకోడే అని, ఎందుకు అభయమివ్వడు..  ఎందుకు ఆదుకోడూ ? ఒక సారి గుర్తు చేసుకొండి ..ఏ ఆపద అయిన కలకాలం వుందా ?  అహా వుంటుందా అని ,మన మన పాప కర్మాలను బట్టి కొందరికి తొందరగా కొందరికి నిదానంగా తొలగొచ్చు అంతే. ఏది ఏమైనా అభయ వ్రతం భక్తుల కొరకు భగవంతుడు ఆచరించే దివ్య వ్రతం.

మరి రెండవది ఏంటీ ? గురువుగారు మళ్ళీ అడిగారు .. మళ్ళీ తెల్ల మొహం వేసాం (అంతే కదా మరి  దేవదేవుడి గురించి మనకు తెల్సింది , తెల్సుకున్నది అమీబా అంతే..)

ఆప్పుడు  ఆయనే చెప్పారు " సత్య వ్రతం," అని. ఎల్లప్పుడు సత్యాన్నే పలకడమే వ్రతం లా ఆచరించడం.  వినడానికి సులభం, చేయటం ... అమ్మో .. సాధ్యమా ... అంటే  పుట్టి బుద్ది ఎరిగినప్పటిని నుంచి చివరి వరకూ ఒక్కటి అంటే ఒక్క అబద్ధం కుడా చెప్పకూడదు.అవసరార్థం కూడా. ఎవరైనా గుర్తుకొస్తున్నారా ... ఆ ఆ అవును.. హరిశ్చంద్రుడే...సత్య హరిశ్చంద్రుడే. అంటే మిగిలిన వారందరూ అబద్ధాల కోరులనా అర్థం కాదు . కాని సందర్భాన్ని బట్టి  అప్పుడప్పుడు మనకు హాని జరుగుతుంది అన్నప్పుడు.. లేదా మనకో మరొకరికో మేలు జరగాలి అన్నప్పుడు , కొన్నిసార్లు వుత్తినే అలా "అసత్య వ్రతం "అదే "అబద్ధ వ్రతం" చేస్తుంటాం. అదే హరిశ్చంద్ర మహారాజు రాజ్యం పొయినా. పుత్ర కళత్రాదులకు ఎన్నో కష్టాలు వచ్చినా చివరికి  ప్రాణ హాని కలుగుతున్నా సత్యాన్ని వదిలిపెట్టడు. అదే అ త్రిలోకాధీషుని రెండవ వ్రతం.

అంతే ..గురువుగారు రెండు చెప్పి ఇక వీళ్ళకి చెప్పి వృధా అనుకున్నట్టున్నారు ఇక విషయం మార్చారు. అప్పుడు నేనే అడిగాను మరి మూడు, నాలుగు వ్రతాలు ఎంటో చెప్పనేలేదూ అని. మరి బ్లాగ్ లో రాయద్దూ.. ( అసలే చాలా ఇంటెరెస్టింగ్ గా వుంది). అలోచించండి అన్నారు. సరే బుర్రకు కొంచెం ఈ సారి పదును పెట్టాను. కొంచెం క్లూ దొరికిందిగా మరి ఎలాంటివో . అభయం, సత్యం అయ్యాయి. చకా చకా ఆలోచించి "ధర్మ రక్షణ" ఒక రాయి విసిరాను. అప్పుడు గురువు గారు అవును....కాని ఇంకా కొంచెం రావల్సి వుంది అన్నట్టు తల వూపారు.  " ధర్మ రక్షణ  అంటే ఎంటీ" ? అని అడిగారు .. "దుష్ట శిక్షణ మరియు సాధు రక్షణ "అన్నాను. అంటే భగవంతుడు సాధు రక్షణ కోసం దుష్ట సమ్హారం చేస్తారా లేక దుష్ట శిక్షణ చేస్తే సాధు రక్షణ అదే జరుగుతుందా అని అడిగారు. సాధు రక్షణే భగవంతుని ఉద్దేశ్యం ఆ కార్యక్రమం లో భాగంగా శిక్షించాల్సి వస్తుంది అన్నాను.  మళ్ళీ సాలోచన గా తల అవును కాదు అన్నట్టు గా తలాడించారు.నా పక్కనున్న మా బంధువు అవి రెండూ అవినాభావ సంబంధం కలిగి ఒకదానిపై ఒకటి ఆధారిపడి వున్నాయి అన్నారు. ఇది సరి అయ్యింది అని అన్నారు. దానికి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. దుష్ట శిక్షణ  ఎప్పుడు చేయాల్సి వస్తుంది. మనలో చాల  వరకు ధర్మాన్ని అచరించాలనే చూస్తాం. చివరికి ఒక బోయ వాడు కూడ జంతువులనే సంహరిస్తాడు కాని ఆ రోజు తినడానికి ఏమీ దొరకలేదని భార్య ,పిల్లల్నో లేక మరొకర్నో చంపరు కదా.  అంటే ధర్మాచరణ చేస్తున్నట్టే కదా.అలానే మనం ధర్మంగానే వుండాలనుకుంటాం కాని రకరకాల మనుష్యులు,పరిస్థితుల మూలంగా కొన్ని సార్లు మౌనం గా వుండాల్సివస్తుంది. ( స్పందించాల్సిన  సమయంలో స్పందించక పోవటం కుడా తప్పే), ఈ పరిస్ఠితి ముదిరినప్పుడు  కాపాడటానికి భగవంతుడు రావల్సి వస్తుంది. శ్రీ మహావిష్ణువు అవతారాలన్ని అలా ఉధ్భవించినవే  కదా.. అలా ధర్మ స్థాపన మూడో  వ్రతం.

సరే మరి చివరి వ్రతం ? ఏమో  నాకయితే ఏమి తట్టలే అలా అలోచిస్తూ ఉండిపోయాను. అప్పుడు మళ్ళీ ఆసక్తి గా వింటున్న మా బంధువు "ముక్తి/మోక్షం ప్రదానం " అన్నారు. అంతే కదా. గురువుగారు కరెక్ట్ అనడము , మళ్ళీ వాళ్ళు హోమం పనిలో మునిగి పోవడం  జరిగిపోయాయి అప్పటి కే ఆలస్యం కావడం తో.  అదన్న మాట సంగతి ..

           

అనుకోని విడిది -సూర్యలంక బీచ్

ఆఫీస్ పని మీద బాపట్ల , ఒంగోలు మరియు నెల్లూరు వెళ్లాల్సి వచింది. ఆంధ్ర ప్రాంతం నేను గత సంవత్సరం గానే వెళ్తున్నాను , అంతకు మించి పెద్ద పరిచయం లేదు, ఏదో చిన్నప్పుడు అన్నవరం వెళ్ళటం తప్పితే. సరే విషయం లోకి వస్తే  నేను , మా టీం లో సీనియర్ మేనేజర్ కలిసి కార్లో వెళ్ళాం బాపట్ల కు .అక్కడ పని చూసుకొని రాత్రికి ఒంగోలు లో మకాం. మా క్లయింట్ బాపట్ల లో ఇప్పుడు  కొంచెం బిజీ గా వున్నాం రేపు ఉదయం 8 గంటలకి మీటింగ్ పెట్టుకుందాం అన్నాడు . అది చాలా ముఖ్యమైన మీటింగ్ , కానీ మాకు బాపట్ల లో వసతి లేదు, మొబైల్ అప్ లలో వెదికినా ఒకటే కనిపించింది అది పెద్దగా నచ్చలేదు. మరి ఏమి చేయాలో తెలియలేదు. ఇంతలో వచ్చేప్పుడు దారికోసం గూగుల్ మ్యాప్స్ లో చూస్తుంటే సముద్రం అంచునుంచి ప్రయాణిస్తున్నట్టు తెల్సింది. సరే దగ్గలో బీచ్ లు ఏమైనా  ఉన్నాయా అని చూస్తే , సూర్య లంక , చీరాల అని రెండు కనిపించాయి. దానిలో సూర్య లంక మరి దగ్గర్లో  వుంది 10 నిమిషాల దూరంలో . సరే ఒంగోలు కు ఎలాగూ వెళ్లి రాక తప్పదు , బీచ్ అయినా చూసి వెళదాం అని అనుకుని వెళ్ళాం. ఫరవాలేదు కారు ని దగ్గరగా తీసుకెళ్లనిచ్చారు. వాహనాలు బానే కనిపించాయి. ఓ పది దాకా చిన్న షాపులు కూడా వున్నాయి . టీ తాగుదామని ఒక కొట్టు దగ్గరికి వెళ్లి అడిగి  ఇటు వైపు మళ్ళా. అక్కడ ఒక పెద్ద  గేటు మరియు ప్రహారి  గోడ కనిపించాయి. ఏంటా అని పరిశీలించి చూస్తే AP టూరిజం వాళ్ళ రిసార్టు వుంది . ఇదేదో భలే వుందే అనుకుంటూ ఇక్కడే వసతి దొరికిదే బాగుంటుంది అని అడిగాం ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి . ఒకే ఒక్క రూమ్ ఉందన్నారు .
ఎంతమంది వుంటారు అని అడిగాడు ఇద్దరం అన్నాము.  మేము ఇద్దరమే అని చూపించాను నన్ను పూజిత ను. ఏంటి ఇద్దరా అని చూసాడు ( అసలు ఉద్దేశ్యం అది కాదు ఇద్దరు ఆడ వాళ్లు ఎందుకు వచ్చారు అన్న అనుమానంగా చూసాడు. చాలా దారుణం గా అనిపించింది ) . ఆఫీస్ పని మీద వచ్చాం ఇద్దరమే అన్నాము . I D కార్డు అడిగాడు చూపించాక ఇంకా అనుమానంగానే వున్న రూం ఇవ్వక తప్పలేదు అతనికి , డబ్బులు కట్టాం. ఒకసారి రూమ్ చూస్తామని అడిగాం. చూపించారు ఫరవాలేదు రూమ్ లో నీట్ గా నే వుంది వాష్ రూమ్ కుడా బాగుంది. అన్నింటికీ మించి మా రూమ్ నుంచి సముద్రం కేవలం 100 మీ దూరం లో వుంది ...చక్కగా సముద్రం అలలు మాకు రూమ్ లోకి కనిపిస్తున్నాయి. ఇంతకూ ముందు కొన్ని బీచ్ లు చూసినా ఇంత దగ్గరలో  రూమ్ దొరకటం, ఒక రాత్రి అంత దగ్గర్లో గడపడం ఎప్పుడు జరగలేదు. ఎంతో  ఉత్సాహంగా అనిపించింది.

సూర్యలంక బీచ్ ఈ మధ్య నే బాగా అభివృద్ధి  చేసారు. చాలా మెత్తటి ఇసుక తీరం అంతటా  
 ఉంటుంది . కొత్తది కాబట్టి అనుకుంటా పెద్దగా జనం లేరు. మేమున్న రిసార్ట్ లో మొత్తం 20 రూమ్ లు వున్నాయి అన్ని ఫుల్ గా వున్నాయి. ఎక్కువ శాతం వేసవి సెలవులలో వచ్చిన కుటుంబాల వాళ్ళే  వున్నారు . ఒక  రూమ్ లో మాత్రం కొంతమంది విద్యార్థులు వున్నారు. చాలా హాయిగా ఆనందంగా అనిపించింది. మొదట మరో జత  బట్టలు లేవు కాబట్టి నీళ్ళల్లో దిగకూడదు అనుకున్నాం, కానీ మా వల్ల కాలే. ఇక ఆ చల్లటి సముద్రం నీటి లో ఎంతో సేపు ఆడుకున్నాం.(ఉప్పగా వున్న ఏం తెలియలేదు .  ప్రశాంత మయిన వాతావరణం, గంభీరమయిన సముద్రం, ఎక్కువ ప్రమాదకరంగా లేని అలలు , రణగొణ ధ్వనులు ఏమీ లేవు. మనల్ని మనం అర్థం చేసుకోవటానికి.. ఒకలాంటి తాదాత్మక స్థితిలోకి తీసుకెళ్తుంది ఆ స్థలం. అక్కడ వున్న రెస్టారెంట్  లో భోజనం కుడా చాలా రుచికరం గా మరీ ఎక్కువ మరీ తక్కువ కాని ధరలలో దొరుకుతాయి.కడుపులో జీవాత్ముడిని శాంతింప చేసి రూం కి వచ్చాం.   

ప్రశాంత మయిన వాతావరణం, గంభీరమయిన సముద్రం, ఎక్కువ ప్రమాదకరంగా లేని అలలతో ఎంతో ఉల్లాసంగా ఉంది అక్కడ. రణగొణ ధ్వనులు ఏమీ లేవు. మనల్ని మనం అర్థం చేసుకోవటానికి ఒక చక్కటి ప్రదేశం. ఒకలాంటి తాదాత్మక స్థితిలోకి తీసుకెళ్తుంది ఆ స్థలం. ఎదురుగా కనిపిస్తున్న అలలు, వాటి నిఘూడమయిన ఘోషను వింటూ చూస్తూ మళ్ళీ వెళ్ళి బీచ్ లో కూర్చున్నాం చాలాసేపు . ఉదయాన్నే లేచి మళ్ళీ తనివి తీరా ఆస్వాందించి అక్కడనుంచి బయలుదేరాం.పది గంటల తర్వాత ఆ వాతావరణం లో తేమ , ఉక్కపోతను భరించటం చాలా కష్టం. సాయంత్రం 4 నుంచి  ఉదయం 9 వరకు అక్కడ అనువైన సమయం. 

 అలా స్వామి కార్యం స్వ కార్యం రెండూ ముగించుకున్నాం.తీవ్రమైన పని వత్తిడి లో ఇలాంటి ఆటవిడుపులు రీచార్జ్ అవటానికి ఎంతో అవసరం.  మీరు గుంటూరు వైపు వెళ్ళిన, ప్రత్యేకించి అయినా సరే తప్పకుండా వెళ్ళాల్సిన పర్యాటక ప్రదేశం.       
నేను - మా నాన్న మొక్కుబడి

మా ఇంటి  దగ్గర్లో వున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం  లో   రాములవారికి మరియు ప్రత్యేకంగా  రాముని పై  తనకున్న స్వామి భక్తిని చాటుతూ స్వామినే చూస్తూ ఎదురుగా చేతులు జోడించి నిల్చున్న   హనుమంతుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రెండు........ అని లెక్క పెట్టుకొని ఇంకా నూట ఆరు.... లెక్క పెట్టుకుంటున్నాను.


ఇంతకీ విషయం లోకి వస్తే.....

అమెరికా లో బి బి ఎ చదవడానికి కావాల్సిన పరీక్షలకు అప్లై చేస్తూ పాస్ పోర్ట్ అవసరమై అలమరా లో వెతికాను. ఎక్కడా కనిపించక పోవటం తో అమ్మను అడిగాను . అలమార లోనే వుంటుంది చూడు అన్నది పని లో బిజి గా వుండటం తో.ఎంత వెదికినా దొరకడం లేదు. నాన్న కుడా వెదకటం   మొదలు పెట్టాడు ..  ఏమి  లాభం లేదు అని ఇక ఆఫీస్ కి వెళ్లి పోయారు నాన్న, మమ్మల్ని వెతకమని .....


ఇంట్లో ఎన్ని అలమారాలు, లాకర్లు  వున్నా దీవాన్ పరుపు కింద లేదా వంటిట్లోని  డబ్బాల్లోనే విలువైన  సామాన్లు దొరుకుతాయి సాధారణంగా . మా ఇల్లు అందుకు అతీతమైంది ఏమీ కాదు. సరే అంతటా వెతకటం అయ్యింది. మా అన్నయ్య కొంచెం సీరియస్ గా వెతికి లేదని తేల్చాడు. మెల్లగా నాకు భయం మొదలయింది, అప్పటివరకు ఈగ కూడా వాలనట్టుంది అమ్మ, ఇంత జరుగుతున్నా కూడా. అన్నయ్య ఇక గట్టిగా లేదనేసరికి అమ్మ వెతకటం మొదలు పెట్టింది మెల్లగా ...ఎక్కడకి పోతుంది వీళ్లకు ఏది దొరుకుతుంది గనక అన్న ధీమాతో. అందులో నేనెప్పుడూ అమ్మకి దొరకని వస్తువు ఇక ప్రపంచంలో ఎవరికీ దొరకదు అని  కితాబులు కూడా ఇస్తూఉంటా .( అందులో కొంత నిజం ..కొంత వెతకటానికి బద్ధకం తో ).  మొదలయ్యింది పాస్ పోర్ట్ వేట. అరగంట దాటింది దొరకడం లేదు. మెల్లగా అన్నయ్య  పాస్ పోర్ట్ పొతే ఎలా అంటూ గూగుల్ తల్లి ని అడగటం మొదలెట్టాడు.

పాస్ పోర్ట్ డూప్లికేట్ తెచ్చుకోవటం పెద్ద కష్టం కాదు కానీ అందులో వున్నా 10 ఏళ్ళ యూస్ వీసా   మాత్రం రాదు మళ్ళీ ఫ్రెష్ గా అప్లై చేసి తెచ్చుకోవాల్సిందే  అన్నాడు నిట్టూరుస్తూ. మనసులో కంగారు మొదలయ్యింది. అప్పుడు  అందరూ చివరగా ఎప్పుడు చూసావో గుర్తు తెచ్చుకో అన్నారు . SAT పరీక్షకి ID ప్రూఫ్  కోసం తీసుకెళ్ళాను అమ్మా అదే లాస్ట్  అన్నాను , నాకు అదే గుర్తుంది మరి . పుస్తకాల సంచి లో, కారు లో ఆ రోజు  పరీక్షకి  తీసుకెళ్లిన అన్ని వస్తువుల్లో వేసుకున్న బట్టలతో సహా వెతికాం... ప్చ్ ...అబ్బె లాభం లేదు.


అమ్మ మొహం కొంచెం గంభీరం గా మారింది. చివరిసారి ఇల్లు సర్దినప్పుడు చిన్నప్పటి పాత పాస్ పోర్ట్ లు నీది అన్నయ్యది చూసి అక్కర్లేదని చింపేసి పడేసినట్టున్నాను రా సరిగ్గా గుర్తు రావటం లేదు, అది ఇదే కాదు కదా అంది.  ప్రపంచంలో దేనికైనా పరిష్కారాలు ఉంటాయి, లేదా మళ్ళీ అవకాశాలు వస్తాయి అని గట్టిగా నమ్మే అమ్మ చాలా బాధ పడుతోంది , కారణం త్వరలో నేను UG కి అప్లై చేయాలి వీసా కు వెళ్ళాలి, అంతలో సజావుగా జరగ కుండా ఇదంతా ఏంటని ...

నాన్న ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి దొరికిందా అని .లేదన్నాము. డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు వెళ్ళినప్పుడు జిరాక్స్ ఇచ్చావు చూడు అన్నారు. అవును .. మా ఇంటికి నాలుగు ఇళ్ల అవతల ఒక షాప్ వుంది అక్కడ జిరాక్స్ తీసుకొని నాన్నకు ఇచ్చాను . కానీ నేను ఒరిజినల్ తెచ్చాను నాన్నా అన్నాను.

అమ్మతో చెప్పాను  ఇదే విషయం. ఎందుకైనా మంచి ఒకసారి వెళ్లి అడుగు అంది . అప్పటికి ఇంకా షాపులు తీసే సమయం కాలేదు. పైగా ఇదంతా జరిగి రెండు నెలల పైనే అయ్యింది. ఒకవేళ అక్కడే మర్చిపోయినా దొరికేది కష్టమే . 10 గంటల దాకా  అతికష్టం మీద ఆగి షాపు కు బయలు దేరాను , వెళ్తూ అమ్మని రమ్మన్నాను ధైర్యం కోసం . సరేనంది అమ్మ, ఇద్దరం వెళ్ళాం . తీరా చూద్దుము గదా అక్కడ జిరాక్స్ షాపు బదులు ఒక పుస్తకాల షాపు పెట్టారు ఈ మధ్యనే ( అయినా ఆ జిరాక్స్ మెషిన్  , ఇంటర్నెట్ కూడా వున్నాయి ఇంకా అందులోనే  ) అంతే    సంగతులు అనుకున్నాం. ఒక మధ్య వయసు వ్యక్తి వున్నాడు అక్కడ .. ఇక్కడ ఏమయినా పాస్ పోర్ట్ మర్చి పోయామా అని అడిగాం.

పాస్ పోర్టా... లేదే అన్నాడు . ఇక్కడ ఒక అమ్మాయి ఉండేది కదా ముందు తనతో జిరాక్స్ చేయించుకొని ఇక్కడే మర్చి పోయామండి కొంచెం చూడరా... ప్లీజ్ అన్నాం . సరే అన్నట్లు తలాడించి డ్రా తెరిచాడు .... రబ్బర్ బ్యాండ్ వేసి వున్న ఒక కట్ట తీసాడు . పాన్ కార్డు లు , ఆధార్ కార్డు లు, పెన్ డ్రైవ్ లు, డ్రైవింగ్ లైసెన్సులు ఎన్నో వున్నాయి వాటిలో . ఎవరు ఏది మర్చి పోయినా మేము ఇలా జాగ్రత్త గా తీసి వుంచుతాము అన్నాడు.   కానీ పాస్ పోర్ట్ లు ఏమి లేవు అన్నాడు. ఆ అమ్మాయి ఇంకా ఇక్కడే పని చేస్తోంది  ఇంకో గంటాగి వస్తుంది రాగానే కనుక్కుంటాను అన్నాడు. అప్పుడు చెప్పాం మా బాధ ,ఎందుకు అది అత్యవసరమో . అవునా అని మా బాధకు మద్దతు ప్రకటించి చూస్తాం లెండి అన్నాడు. మేము మళ్ళీ ఒకసారి గట్టి గా చూడండి అని నొక్కి నొక్కి చెప్పి వస్తుంటే , అందులో ఫోటో ఉందా అని ఆరా తీశాడు . ఆ మా అబ్బాయిది కానీ చిన్నప్పటి మొహం ఉంటుంది అని అన్నది అమ్మ . అలా వచ్చేస్తుంటే ఒక నిమిషం అని ఆ లోపల వున్న మరో డ్రా తెరిచాడు మేమిద్దరం వెళ్లి అందులో తల దూర్చి చూసాం ...ఒక నల్లని పాస్ పోర్ట్  దానిపై స్టికర్ లో మాధవన్ అని పేరు అంతే.. అదే అంకుల్  అదే అంటూ లాక్కున్నంత  పని చేసాం . అతనికి పదే పదే థాంక్స్ చెప్తూ వచ్చేసాం, అది కలనో ..నిజమో  .. తెలియని పరిస్థితిలో ..

ఇంటికి వచ్చి నాన్నకి చెప్తే వెంటనే చెప్పాడు ....రామాలయంలో ఆంజనేయస్వామి కి 108  ప్రదక్షిణాలు చేస్తావని దండం పెట్టాను దొరికితే అని.  అదే ఇది. ( నాన్నెప్పుడూ ఇంతే , ఇంతకు ముందు ఒకసారి  నానమ్మను తిరుపతి తీసుకొస్తానని మొక్కాడు.నానమ్మ వెంట్రుకలు ఇస్తానని ఇలా ఇది వంశాచారం ).

( ఆ తర్వాత అప్లై చేయడం అన్నింటిలో సీట్ రావటం స్కాలర్షిప్ కూడా దొరకటం అన్ని జరిగాయి )

సనాసర్ - ప్రకృతి తో సహవాసంవై .హెచ్. ఏ. ఐ గురించి నేను ఈనాడు అనుబంధ పుస్తకం లో 2008 లో మొదటి సారిగా చదివినప్పట్నుంచి ప్రతి సంవత్సరం వేసవిలో ఎంతో చవగ్గా , రోటీన్ కి భిన్నం గా వుండే  వారి యాత్రలకి వెళ్ళాలనుకోవటం , అనివార్య కారణాలవలన  వెళ్ళలేకపోవటం జరుగుతున్నది.ఈ సంవత్సరం మాత్రం అలా కాకూడదని నేను మా చిన్నబ్బాయి, అక్క కూతురు  బయల్దేరాం . అందుబాటులో  వుండి అదీ తక్కువ రోజుల్లో  వున్న సాహసయాత్రల్లో ఒకటైన "సనాసర్ అడ్వెంచర్ కాంపింగ్ "ఎంచుకున్నాం. హైదరాబాద్  నుంచి డిల్లీ కి రాను పోను విమానంలో బుక్ చేసుకున్నాం అంతే. డిల్లీ కి వెళ్ళింతర్వాత అక్కడనుంచి జమ్ము కి రైళ్ళు, బస్సు సౌకర్యం వుంటుంది .(సుమారు 650 కి. మీ) పన్నెండు గంటల ప్రయాణం . అలా ఉదయం 8 గంటలకి జమ్ము చేరుకున్నాం. ఇంటర్నెట్  లో చూసినదాని ప్రకారం   జమ్ము నుంచి సనాసర్ 130 కిమీ. ఉదంపూర్ , కుడ్, పట్నిటాప్  మీదుగా సనాసర్ చేరుకో వచ్చు.

జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్ళే హై వే నంబర్ 1 పైనే సుమారు 110  కిమీ వెళ్తే పట్నిటాప్ చేరుకోవచ్చు . అదే కార్గిల్, లేహ్ వెళ్ళే దారికుడాను. బస్సులు ,శ్రీనగర్ వెళ్ళే షేరింగ్ వాహనాల లో   కూడ పట్నిటాప్ వెళ్ళవచ్చు. దారి మొత్తం జమ్మూ లోని హిమలయాలలోని మొదటి వరస పర్వత శ్రేణి శివాలిక్ లు , వాటి మధ్య లోయలలో పారే తావి నది వీక్షకుల  కనుల విందు చేస్తాయి .

దారిమొత్తం పర్యాటకుల వాహనాలతో, శ్రీనగర్ కు సరుకుల రవాణా చేసే వాహనాలతో చాలా సందడిగా వుంది.  దాదాపు ప్రతి మైలుకి భారత ఆర్మీ జవాన్లుతమ విధులు నిర్వహిస్తూ  కనిపిస్తుంటారు.  జమ్మూ నుంచి బయల్దేరినుంచి ఎంతో వేడిగా వున్న వాతావరణం అలా మా గమ్యస్థానం దగ్గరవుతున్నకొద్దీ శీతల  గాలులు  పలకరించసాగాయి. అలా ఐదు గంటలు ప్రయాణం తర్వాత 3000 మీటర్ల ఎత్తు శివాలిక్ కొండ అంచున లోయలో వున్న సనాసర్ కు చేరుకున్నాం.

సన మరియు సర్ అనే నదుల మధ్యలో వున్నందున ఈ ప్రాంతానికి సనాసర్ అనే పేరు వచ్చిందని ప్రతీతి. ఇక్కడ జమ్ము & కాశ్మీర్ టూరిజం వారి విడిదులు, అలాగే కొన్ని ప్రైవేటు రిసార్టులు వున్నాయి. మేము వెళ్లిన రిసార్టు లో టెంట్లలో మా వాసం.మూడు రోజులు రోజూ  కొన్ని కార్యక్రమాలు వున్నాయి.

వెళ్ళగానే ఎంతో ఆదరం గా మమ్మల్ని ఆహ్వానించి వేడివేడిగా భోజనం కొసరి కొసరి వడ్డిచ్చారు. కాసేపు విశ్రాంతి తీసుకొని  ఆ ప్రాంతం అంతా అలా చుట్టి వచ్చాం.
అక్కడక్కడాకనిపించే మంచు కొండల్, మామూలు పర్వతాలు, లోయలు, పచ్చిక మైదానాలు, దేవదారు, కోనిఫెర్ వృక్షాలు, సెలయేళ్ళు అక్కడి కొండ ప్రాంతపు నిష్కల్మషమైన మనుషులు వారి అభిమానాలు మనల్ని ఉ క్కిరి బిక్కిరి చేస్తాయి. ఆ రిసార్టు యజమాని ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్  .ప్రకృతి పై మమకారంతో ఇక్కడ ఇది హాబీ గా  నిర్వహిస్తుంటారు. వారాంతం లో మరియు వేసవి సెలవులు మొత్తం వారి కుటుంబం ఇక్కడే గడుపుతుంతారు.  జమ్మూ మరియు ఉత్తర భారతం లో జూన్ లో వేసవి సెలవులవటం వలన ఎక్కువ రద్దీ లేదు. (మేము మే లో వెళ్ళాం )  


మొదటి రోజు ఆ జిల్లాలోనే ఎత్తయిన పర్వతం  మీద వున్న శంఖ్ పాల్ గుడి కి ఒక గైడ్ సహాయంతో  (3000 మీ) ట్రెక్కింగ్ చేస్తూ బయలు దేరాం. అక్కడక్కడా ఆగుతూ నాలుగు గంటలలో పైకి చేరుకున్నాం. పైకి ఎక్కుతున్నప్పుడు దూరంగా శ్రీనగర్  మంచు కొండలు కూడ స్పష్టంగా కనిపించసాగింది.  ఆ  కొండలపై  అక్కడ అక్కడ విసిరేసినట్టు వున్న మట్టి ఇళ్ళలో గుజ్జర్లు నివసిస్తుంటారు. వీరు ఎక్కువ శాతం దేశదిమ్మర్లు. పశువుల పెంపకం మరియు వ్యవసాయం వీరి ప్రధాన వృత్తులు.వీరు ఎంతో కష్ట జీవులు. వేసవిలో 
సనాసర్ కు చలికాలంలో జమ్ము కు కుటుంబం, సామన్లు మరియు పశువులతో నడుస్తూ వలస వెళ్తుంటారు.

అలా పైపైకి వెళ్ళే కొద్ది కొంత సూర్యుడి ప్రతాపమున్నా చల్లటి గాలి వీయడంతో ఎంతో, హాయిగ మేఘాలు అలా అందుకొని వెళ్ళొచ్చేమో అనిపించేలా...  ప్రపంచాన్ని అధిరోహించిన భావన కల్గింది. మా అబ్బాయి అయితే నాకు ఇక్కడే  వుండిపోవాలని వుంది అని ఎంతో ఆనందంగా గంతులు వేయసాగాడు.

 తిరిగి కిందకి వచ్చే సరికి వారం రోజులు నడకతోనే రకరకాల ప్రదేశాలు తిరుగుతూ వస్తున్న 12 మంది బృందం ఒకటి వచ్చింది. ఆశ్చర్యకరంగా ఆ బృందంలో పదిమంది 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు  వున్నారు. వారంతా ఎంతో చలాకిగా ,ఆనందంగా, ఇష్టం గా వారి ట్రెక్కింగ్  కొనసాగిస్తున్నారు.

ఆ రోజు సాయంత్రం గుర్రం స్వారీ కూడ చేసాం. మరుసటి రోజు ఉదయాన్నే  వాతావరణం చాలా ఆహ్లాదంగా వుండటం తో రాక్ క్లైంబింగ్    మరియు రాపెల్లింగ్ చేయటానికి  కింద ఒక పెద్ద లోతైన లోయ తో నిట్ట నిలువుగా వున్న ఒక కొండపైకి వెళ్ళాం . సాయంత్రం  విలువిద్య, రైఫిల్ షూటింగ్ కూడా చేసాం.

మరో రోజు ఆ పక్కనే వున్న ఒక జలపాతాన్ని చూసి ,స్నానాలు  చేసి  ఆ చుట్టూ వున్న ప్రదేశాలన్ని  చూసాము. అక్కడ వున్న గుడి లోని నాగదేవత ఎంతో మహిమ వుందని అక్కడివాళ్ళ  నమ్మకం.  ఆ రిసార్టు యజమాని కుటుంబం మొత్తం మాతో గడపడం తో మాకు అసలు సమయమే తెలియలేదు.

ఆ వూరిలొనే "జవహర్ మౌంటనీరింగ్ ఆండ్ వింటర్ స్పొర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ " శీతాకాలంలో పిల్లలకు సాహస ఆటలు నేర్పిస్తారు .దాదాపు 200 మంది పిల్లల్తో,శిక్షకులతో కళకళలాడుతూంది.

మూడో రోజు ఆక్కడ టాపి నదిలో కాసేపు సమయం గడిపి డిల్లీ వెళ్ళటానికి ఉధంపూర్ రైల్వే స్టేషన్  చేరుకున్నాము.ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు పుస్తకం లోని నాయని  కృష్ణకుమారి రాసిన "కాశ్మీర దర్శనం"  పాఠం లోని  వర్ణనలను ప్రత్యేకించి జమ్ము, ఉధంపూర్ నెమరువేసుకుంటూ  తిరుగు ప్రయాణమయ్యాము.        

97-67 నేను నా బరువు ప్రస్థానం రెండవ భాగం

నేనయితే రాఖీ చిత్రం లో జూ ఎన్టీఆర్  ను చూసి ఆ తర్వాత వచ్చిన యమదొంగ ట్రైలర్  లు చూసి అవాక్కయ్యాను. ఎంత కమిట్ మెంట్ ఉంటే అంత మార్పు సాధ్యమవుతుంది.... సినిమా ఇంటర్యూలలో రాజమౌళి ఖచ్చితంగా జూ ఎన్టీఆర్ ని ఈ సినిమా కోసం అధిక బరువు తగ్గమన్నాడని అందుకే ఈ రూపం అని చెప్పాడు. ఇది కూడా గట్టిగా మెదడు లో తిష్ట వేసుకు కూర్చుంది. అలాగే టీనా అంబాని కూడా.( నేను ఇది రాయటం మొదలెట్టినప్పుడు టీనా మాత్రమే ఇప్పుడు వాళ్ళబ్బాయి అనంత్ కూడా )
మనం ఇలా ఎవరితో అయినా అంటే వారి వృత్తి అది అలా ఉంటేనే వారికి కెరియర్ నాలుగు డబ్బులు వస్తాయి  అని అంటారు . అధిక బరువును తగ్గించుకోవటమే కాకుండా అలానే ఉంచుకోవాలంటే ముందుగా లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న మార్పులు తప్పనిసరి. నాకు తెలిసినంతవరకు పోషకాహారం పై చక్కటి అవగాహన, శారీరక వ్యాయామం, మానసిక ధృడత్వం  కలిగి ఉంటే చాలు. బరువు దానంతట అదే తగ్గుతుంది. మేనేజ్ మెంట్ పాఠాల్లో చెప్పినట్టు సమస్యకు కారణం తెల్సుకుంటే సగం సమస్య సాల్వ్ చేసినట్టే.

కాబట్టి ముందు మనం శరీర జీవక్రియ Metobolism  గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి.. సాధారణంగా ఎందుకు మనం అధిక బరువు తో బాధపడుతున్నామో విశ్లేషించుకోవాలి .  కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులలో తప్ప లావుకి ముఖ్యకారణం మనం తీసుకొనే శక్తికి(కాలరీలకు) శరీరం ఖర్చు చేసే శక్తికి(కాలరీలకు) మధ్య వుండే తేడా నే. మన రోజూవారి దినచర్య ను పరిశీలించుకుంటే మన  శారీరక క్రియ కు ఎంత శక్తి అవసరమో తెలుస్తుంది.

అందులోనూ మనం మన  భారత దేశంలో  పిండి పదార్ధాలను ఎక్కువ  పరిమాణంలో ముఖ్య ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పిండి పదార్థాలు శరీరక్రియలకు కావాల్సిన శక్తినిస్తాయి.కాని ఒకవేళ మనం చేసే పని కన్నా ఎక్కువ పిండి పదార్ధాలను తీసుకుంటే శరీరం అవసరం మేర శక్తిని వాడుకొని మిగిలిన దాన్ని కొవ్వు పదార్ధాలు గా మార్చి నిల్వ చేస్తుంది. పైగా ఎలాగూ నూనే, నెయ్యి, దుంపలు,  రూపంలో కొవ్వు పదార్ధాలు కూడా తీసుకుంటూ ఉంటాం . అంతే  సన్నగా, అందంగా  ఉన్నవాళ్ళు కూడా  లావుగా  వికారంగా అవటం మొదలవుతుంది.

ఇళ్ళల్లో మన పెద్దవాళ్ళు నీరు వల్ల , గ్యాస్ వల్ల లేదా పుట్టుక తీరు అని సమర్ధిస్తూంటారు.  అసల తిండికి లావుకి సంబంధమే లేదని అసలు ఏం తినము  అది ఒళ్ళు తీరు అని  అంటువుంటారు. ఎందుకు లేదు సంబంధం సలక్షణం గా ఉంటుంది . నా వరకు అర్థం అయ్యింది ఏంటంటే డైటింగ్ అంటే అందరూ అనుకున్నట్ట్టు  కడుపు మాడ్చుకోవడమో కట్టుకోవడమో ఎంత మాత్రమూ కాదు . సరైన సమయానికి సరైన ఆహారం (పౌష్టిక ) తీసుకోవడం .  వీలయినంత  చురుగ్గా ఉండటం. అన్నిటి కన్నా ముఖ్యంగా మనసులో /మెదడులో మనం తింటున్న పదార్థాలు  లిస్టు ఎప్పుడు పరిశీలనలో ఉండాలి , దానికి తగ్గ శారీరక క్రియ చేస్తూ ఉండాలి. ఈ లెక్క తప్పితే మన శరీరం పై పట్టు కోల్పోయినట్టే .కొందరికి జన్మతః మెటబాలిజం బాగుంటుంది. మన తోటి వారిలో కొంత మంది బాగా తిన్నా చక్కగా చెక్క లా వుంటారు. ఈర్ష పడేలా.

ఇప్పుడు నేను మళ్ళీ టార్గెట్ తో బరువు తగ్గే కార్యక్రమం మొదలెట్టాను. ఇది ఫలితం కనపడగానే ఇంకా వివరాలు రాస్తాను.(Pics courtesy : Google) మనలో మాట

                          


                              
మన దైనం దిన జీవితంలో తరచుగా కోపంగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు గట్టి గట్టిగా అరుచుకోవడం చూస్తూ ఉంటాం. నిజం చెప్పాలంటే మనం కొన్నిసార్లు అరుస్తాం మన మీద ఎవరో ఒకరు  కోపంతో అరిచే ఉంటారు.

ఈ మధ్యనే అంతర్జాలం లో, ఫేస్ బుక్ లో  "కోపం తో ఉన్నప్పుడు గట్టిగా ఎందుకు అరుస్తారు " ???  అనే విషయం పై ఒక వ్యాసం చదివాను. అందులో చాలా ప్రాచుర్యం లో ఉన్న ఒక కథ ఉదహరించారు. ఒక సారి నాకు తెల్సిన వారితో ఇది పంచుకోవాలనిపించింది.

పూర్వం ఒక ఋషి తన శిష్యులతో కూడి గంగా నది లో స్నానం చేస్తున్నారట. ఒడ్డున ఒక  కుటుంబీకులు పెద్ద పెద్దగా ఒకరిపై ఒకరు ఏదో విషయం పై అరచుకోవడం చూసి  ఋషి  చిరునవ్వు నవ్వి "వారెందుకు అలా అరుచుకుంటున్నారని" శిష్యులని ప్రశ్నించారట. దానికి ఒక శిష్యుడు "వారు వారి ప్రశాంతను , స్థిమితాన్ని  కోల్పోయినందువల్ల అలా అరుస్తున్నారు" అని సమాధానం ఇచ్చారట. దానికి ఆ ఋషి " పక్కనే ఉన్న వ్యక్తి తో మాములు స్వరం లో చెప్పినా వినిపిస్తుంది కదా అంత గట్టిగా ఎందుకు చెప్తున్నారు"  అని తిరిగి అడిగాడు.శిష్యులు చెప్పిన రకరకాల సమాధానాలతో తృప్తి పడని ఆ ఋషి ఇలా వివరణ ఇచ్చాట్ట.

ఇద్దరు వ్యక్తు ల మధ్య ప్రేమ ,అభిమానాలు పరిపూర్ణంగా ఉన్నప్పుడు వారి మనసుల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు. కాబట్టి సున్నితంగా, చిన్నగా మాట్లాడినా ఒకరిది ఒకరు అర్ధం చేసుకోగల్గుతారు. నిజానికి కళ్ళ సైగలతోటే సంభాషించుకోగల్గుతారు. మది లోని భావాలు గ్రహించగల్గుతారు. అదే హృదయాల మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పుడు వారు భౌతికంగా  పక్క పక్క నే ఉన్నా కూడా  చాలా దూరంగా ఉన్నట్టు భావిస్తారట .  ఆ దూరాన్ని అధిగమించేందుకు అవతలి వ్యక్తికి  తమ భావం చేరేందుకు తామెంత దూరమని భావిస్తున్నారో అంత స్వరం పెంచి అరుస్తారు. కొన్నిసార్లు మన పక్కనే ఉన్న వ్యక్తులు కూడా కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నంత గా( మానసికంగా) అన్పిస్తారు. అదే వేల మైళ్ళ దూరంలో ఉన్నవాళ్ళు కూడా మనతోటే ఉన్నట్టు ఉంటారు.

ఈ వివరణ కొంతవరకు తార్కికంగా అన్పించింది నాకు. మనతో ఎవరైనా అలా ప్రవర్తిస్తున్నప్పుడు మనం వారు చెప్పాలనుకున్న విషయాన్ని  గ్రహించగల్గుతే ఆ దూరాన్ని మరింత పెంచకుండా , సమస్య జటిలంగా మారకుండా కొంతవరకైనా చూడవచ్చు కదా.


(Picture courtesy :google images)

2015 - నాకేం తీర్మానాల్లేవ్ముందుగా బ్లాగు మిత్రులందరికి  వైకుంఠ ఏకాదశి , ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.......!!!

అందరూ కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా వేడుకలు జరుపుకోవడం,గత సంవత్సరాన్ని అవలోకం చేసుకోవటం జయప్రదంగా ఉంటే సంతోషించడం, లేకుంటే విచారించినా  దాని నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా కొత్త  సంవత్సరాన్ని దిశా నిర్దేశం చేసుకోవటం సాధారణంగా అందరూ చేస్తుంటారు. (నేను కూడా).

కాని ఈ సారి నేను కొంచెం భిన్నంగా ఎలాంటి తీర్మానాలు చేసుకోదల్చుకోలేదు. అలా అని పోయిన సారి నేను అనుకున్నవేమీ చేయలేదని  కాదు. దాదాపుగా అన్నీ చేసాను......!!!

 ముందుగా నిర్దేశించుకోకుండా, ఏవి ఇలా జరగాలని  ఆశించకుండా స్వేచ్ఛగా ఉండాలని...... !!   అంతే.........!!!

(Picture courtesy :google images)

హృదయాన్ని స్పృశించే పాట

రంగస్థలం సినిమా ఎలా ఉన్నా ఈ పాట మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. చంద్రబోస్ కలం నుంచి జాలువారిన మరో అద్భుతం.  చెట్టంత ఎదిగిన కొడుకు మరణిస్తే ...